భారత్‌లో పదేళ్లలో మూడింతలు పెరిగిన క్రెడిట్‌ కార్డు మార్కెట్‌

  • 5.2 కోట్లకు చేరిన కార్డు హోల్డర్ల సంఖ్య
  • యువత, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న వినియోగం
  • రూ.3.1 లక్షల కోట్లకు పెరిగిన కార్డు బకాయిలు
  • భారత్‌లో ఇంకా 25% మందికే క్రెడిట్‌ కార్డులు
  • క్రెడిట్‌ కార్డుల విస్తరణకు భారీ అవకాశాలు
దేశంలో గత పదేళ్లలో క్రెడిట్‌ కార్డుల వినియోగం మూడు రెట్లకు పైగా పెరిగిందని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ నివేదిక వెల్లడించింది. కొత్తగా క్రెడిట్‌ కార్డులు తీసుకుంటున్న వారిలో యువతతో పాటు సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోందని తెలిపింది. అయినప్పటికీ దేశంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం ఇంకా తక్కువగానే ఉందని అభిప్రాయపడింది. ఈ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

2016 మార్చిలో 1.4 కోట్లుగా ఉన్న క్రెడిట్‌ కార్డు హోల్డర్ల సంఖ్య 2026 మార్చి నాటికి 5.2 కోట్లకు చేరింది. ఇదే కాలంలో యాక్టివ్‌ క్రెడిట్‌ కార్డులు 2.1 కోట్ల నుంచి 10.7 కోట్లకు పెరిగాయి. క్రెడిట్‌ కార్డులపై బకాయిలు రూ.0.4 లక్షల కోట్ల నుంచి రూ.3.1 లక్షల కోట్లకు పెరిగాయి.

కొత్తగా క్రెడిట్‌ కార్డు తీసుకున్న వారిలో 30 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్నవారి వాటా 2022లో 43 శాతం ఉండగా 2026 నాటికి 50 శాతానికి చేరింది. అలాగే సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల నుంచి కార్డులు తీసుకున్న వారి వాటా 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది.

అంతేకాదు తొలి క్రెడిట్‌ కార్డు తీసుకునే వారిలో 25 శాతం మందికి ఇప్పటికే మూడు లేదా అంతకంటే ఎక్కువ లోన్‌ అకౌంట్లు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. చిన్న మొత్తాల వ్యక్తిగత రుణాలు, వినియోగ వస్తువుల రుణాలతో పాటు క్రెడిట్‌ కార్డులను కూడా వినియోగిస్తున్నారని పేర్కొంది.

అయితే భారత్‌లో క్రెడిట్‌ యాక్టివ్‌ వినియోగదారుల్లో కేవలం 25 శాతం మందికే క్రెడిట్‌ కార్డులు ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇది బ్రిటన్‌ (70%), కొలంబియా (62%), హాంకాంగ్‌ (98%)తో పోలిస్తే చాలా తక్కువ. దీంతో దేశంలో క్రెడిట్‌ కార్డుల విస్తరణకు ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయని ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ పేర్కొంది.

TransUnion CIBIL
Credit Card Market India
Credit Card Usage Growth
Indian Consumer Credit
Financial Market Trends
Credit Card Statistics

More Telugu News